Kaizer News

మట్టి చక్రం.. మారని బతుకు!

మట్టి చక్రం.. మారని బతుకు!

· State - Telangana · prabhanews.com

మట్టి కుండలకు ఆదరణ కరవు వేలేరుపాడు, ఆంధ్రప్రభ: ఉదయం తెల్లవారకముందే నిద్రలేచి, చల్లని బంకమట్టిని చేతుల్లోకి తీసుకుని ఆ కుమ్మరి చక్రం తిప్పడంతో వారి దినచర్య మొదలవుతుంది. చక్రం గిర్రున వేగంగా తిరుగుతుంటే, ప్రాణం లేని ఒక మట్టి ముద్ద ఆ చేతివేళ్ల మృదువైన స్పర్శతో ఓ అందమైన కుండగా రూపాంతరం చెందుతుంది. ఇది కేవలం మట్టితో చేసే వస్తువు కాదు, తరతరాలుగా తమ చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న ఓ అద్భుతమైన జీవన కళ. ఒకప్పుడు ఈ మట్టి కుండల కోసం జనం ఎగబడేవారు. కాలం ఏదైనా సరే, ప్రతి ఇంటా మట్టి పాత్రలదే ప్రథమ స్థానం. ఆ మట్టి కుండలోని నీళ్లు తాగితే, ఎంతో తీయగా, అమృతంలా చల్లగా ఉండేవి. ఆ నీటిలో కలిసే సన్నని మట్టి పరిమళం దాహాన్ని తీర్చడమే కాకుండా, పల్లెటూరి స్వచ్ఛతను నేరుగా గొంతులోకి జారవిడిచినట్లు అనిపించేది. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఆధునికత మన ఇళ్లలోకి, మన ఆలోచనల్లోకి అత్యంత వేగంగా చొచ్చుకొచ్చింది. మన వంటగదుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మట్టి కుండలు కొలువుదీరాల్సిన స్థానంలోకి ఖరీదైన ఫ్రిజ్‌లు, అత్యాధునిక వాటర్ ప్యూరిఫైయర్లు వచ్చి చేరాయి. ఎటు చూసినా మెరిసిపోయే స్టెయిన్‌లెస్ స్టీల్, రంగురంగుల ప్లాస్టిక్ పాత్రలదే ఆధిపత్యం నడుస్తోంది. ఈ ఆధునిక ప్రపంచపు పరుగులో, యంత్రాల వేగం ముందు సహజమైన మట్టి కుండల వైపు కన్నెత్తి చూసేవారే కరవయ్యారు. ఈ వేగవంతమైన మార్పుల వల్ల తమ పూర్వీకుల నుంచి కుండల తయారీనే వృత్తిగా నమ్ముకుని జీవిస్తున్న అనేక మంది కళాకారులు నేడు దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకుని, రోజంతా శ్రమించి ఎంతో ప్రేమగా తయారుచేసిన కుండలు అమ్ముడుపోక వారి కళ్ల ముందే అలాగే మిగిలిపోతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల వైపు పరుగులు తీస్తున్న నేటి సమాజంలో కుండల విక్రయాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పూట గడవడం కష్టంగా మారుతున్నప్పటికీ, తమ పూర్వీకుల నుండి వచ్చిన ఈ అద్భుతమైన విద్యను వదులుకోలేక నేటికీ వారు ఆ మట్టి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. తమ కళ్ల ముందే తమ కళ కనుమరుగవుతున్నా, ఆ శ్రామికుల గుండెల్లో ఇంకా ఓ చిన్న ఆశ సజీవంగానే ఉంది. పకృతితో, ముఖ్యంగా మట్టితో మనకున్న మమేకమైన ఆ ప్రాచీన అనుబంధం మళ్లీ చిగురిస్తుందా.. లేదా ఈ ఆధునికత సుడిగుండంలో పడి కాలగర్భంలో శాశ్వతంగా కలిసిపోతుందా.. తమ కళకు, శ్రమకు మళ్ళీ గుర్తింపు రాకపోతుందా అని ఆ తయారీదారులు ప్రతిరోజూ తమ కళ్లల్లో కొండంత ఆశలతో ఎదురుచూస్తూనే ఉన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News