సినిమా తెరపై జానీ లివర్ కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయాల్సిందే. తనదైన మేనరిజమ్స్, వాయిస్ మాడ్యులేషన్, మిమిక్రీ, అద్భుతమైన కామెడీ టైమింగ్తో దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ ఆయన. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జానీ లివర్ మూలాలు మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఆయన అసలు పేరు జాన్ ప్రకాశ్ రావు జనుమాల. 1957 ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్లోని కనిగిరిలో తెలుగు క్రైస్తవ కుటుంబంలో జన్మించినట్లు IMDb సహా పలు బయోగ్రఫీ వనరులు పేర్కొంటున్నాయి. జానీ లివర్ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ, ఆయన బాల్యం, కళా ప్రయాణంలో ఎక్కువ భాగం ముంబైలోనే సాగింది. కుటుంబం ముంబైకి వెళ్లిన తర్వాత అక్కడి కింగ్స్ సర్కిల్, ధారావి ప్రాంతాల్లో ఆయన పెరిగారు. చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతి తర్వాతే చదువును ఆపేయాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్న వయసులోనే పనులు చేయడం ప్రారంభించారు. ముంబై వీధుల్లో పెన్నులు అమ్ముతూ.. అదే సమయంలో ప్రముఖ సినీ నటులను అనుకరిస్తూ తనలోని మిమిక్రీ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఆయన అసలు పేరు జాన్ ప్రకాశ్ రావు జనుమాల. మరి జానీ లివర్ అనే పేరు ఎలా వచ్చింది? అనే చాలామందికి ఉంటుంది. జానీ లివర్ తండ్రి హిందుస్తాన్ లివర్ సంస్థలో పనిచేసేవారు. కొంతకాలం జానీ లివర్ కూడా ఆ సంస్థలో కార్మికుడిగా పనిచేశారు. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తన మిమిక్రీతో కంపెనీ అధికారులను అనుకరించి అందరినీ నవ్వించారు. ఆ ప్రదర్శన తర్వాత సహచరులు సరదాగా ఆయనను జానీ లివర్ అని పిలవడం ప్రారంభించారు. అదే పేరు తర్వాత ఆయన సినీ జీవితానికి బ్రాండ్గా మారిపోయింది. జానీ లివర్ కామెడీ ఒక్కరోజులో పుట్టింది కాదు. చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న మనుషులను గమనించడం, వారి మాటతీరు, హావభావాలను అనుకరించడం ఆయనకు అలవాటైంది. టీచర్ల నుంచి సినిమా హీరోల వరకు.. వీధుల్లో కనిపించే సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరినీ గమనించి వారి శైలిని అనుకరించేవారు. ఈ పరిశీలనా శక్తే తర్వాత ఆయన కామెడీకి అతిపెద్ద బలంగా మారింది. ముంబైలో చిన్న చిన్న కార్యక్రమాల్లో మిమిక్రీ, కామెడీ ప్రదర్శనలు ఇస్తూ క్రమంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో స్టాండ్అప్ కామెడీ అనే పదమే పెద్దగా ప్రాచుర్యంలో లేని సమయంలోనే జానీ లివర్ వేదికలపై సోలో కామెడీ ప్రదర్శనలు ఇచ్చేవారు. స్టేజ్ షోల ద్వారా వచ్చిన గుర్తింపు జానీ లివర్ను సినిమా వైపు తీసుకెళ్లింది. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత తన ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోలు, విలన్లు, సహాయ నటుల మధ్య కామెడీ ట్రాక్లకు ఆయన కొత్త ఊపునిచ్చారు. కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాకుండా.. ముఖ కవళికలు, శరీర భాష, వాయిస్ మాడ్యులేషన్, మిమిక్రీతో సన్నివేశానికి ప్రాణం పోయడం ఆయన ప్రత్యేకత. దీంతో కొద్దికాలంలోనే బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఒకరిగా ఎదిగారు. జానీ లివర్ ప్రతిభకు అనేక అవార్డులు, నామినేషన్లు దక్