జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్ష–పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) 2026 పరీక్ష ఆదివారం (ఆగస్టు 30) దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కీలక పరీక్షకు దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులను ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఆధార్ ఆధారిత ధృవీకరణతో పాటు అవసరమైన గుర్తింపు తనిఖీలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా NEET-PG అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. అదనంగా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో NEET-PG పరీక్షకు సుమారు 18,700 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు తెలంగాణలో నీట్ పీజీ పరీక్ష కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో 4, రంగారెడ్డిలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచే ప్రధాన జంక్షన్ల వద్ద రద్దీ పెరగనున్న నేపథ్యంలో కీలక పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో షేక్‌పేట్ జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే పరీక్షార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే బయలుదేరాలని, అత్యవసర సమాచారం కోసం 90102-03626 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. 4 గంటల పాటు జామర్లు.. మొబైల్ నెట్‌వర్క్‌పై నిఘా! ఇక, కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణ సంస్థ TCS ఆధ్వర్యంలో స్థానిక పోలీసుల సహకారంతో అభ్యర్థుల తనిఖీలు చేపట్టనున్నారు. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. పరీక్ష సమయంలో సుమారు నాలుగు గంటల పాటు జామర్లు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాస్ కాపీయింగ్ లేదా ప్రశ్నపత్రం లీక్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోలీస్ సైబర్ విభాగాలు కూడా రంగంలోకి దిగాయి. సాధారణ మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయ