దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(DUSU) 2026 ఎన్నికల్లో ABVP సత్తా చాటింది. కీలకమైన ప్రెసిడెంట్ పోస్ట్ సహా మూడు స్థానాలను కైవసం చేసుకుని మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ఏబీవీపీకి చెందిన యష్ దబాస్ 24,576 ఓట్లతో విజయం సాధించారు. NSUI అభ్యర్థి విజయ్ శంకర్ విజయ్ మీనాపై దాదాపు 2,053 ఓట్ల మెజారిటీతో ప్రెసిడెంట్ గా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి. అలాగే వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ ఘనవిజయం సాధించారు. ఆయన 30,615 ఓట్లతో ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్యపై ఏకంగా 13,705 ఓట్ల తేడాతో ఘనవిజయం పొందారు. దిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో సెక్రటరీ పోస్టుకు పోటీచేసిన ఏబీవీపీ అభ్యర్థి రియా ఛావ్ దీ.. 21,650 ఓట్లతో NSUI అభ్యర్థి అయిన నమ్రతా చౌదరిపై 6,781 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక జాయింట్ సెక్రటరీ పోస్టుకు గాను ABVP కు చెందిన లక్ష్య రాజ్ సింగ్ 16,641 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి విశేష్ యాదవ్ పై 863 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి దిల్లీ హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాల మేరకు క్యాంపస్ లోపల లేదా బయట ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు గెలిచిన అభ్యర్థులకు, వారి మద్దతుదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక దిల్లీ యూనివర్సిటీ వ్యాప్తంగా 52 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 40.46 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో భారీ భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. క్యాంపస్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతన DUSU సెంట్రల్ ప్యానెల్ బాధ్యతలు చేపట్టనుంది. DUSU సెంట్రల్ ప్యానెల్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు