Kaizer News

‘ఆదర్శకుటుంబం’ కోసం క్లాసిక్‌ సాంగ్‌ రీమేక్‌?

‘ఆదర్శకుటుంబం’ కోసం క్లాసిక్‌ సాంగ్‌ రీమేక్‌?

· Entertainment · ntnews.com

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శకుటుంబం: హౌస్‌ నెం 47’ సినిమా ముందు వరుసలో ఉంటుంది. వెంకటేశ్‌ నటించిన నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటలు రాశారు. ఆ సినిమాల విజయాల్లో వెంకటేశ్‌ నటన, త్రివిక్రమ్‌ రచన ప్రధాన పాత్రలు పోషించాయనడం అతిశయోక్తి కాదు. అప్పుడు వెంకటేశ్‌ సినిమాకి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్‌.. ఇప్పుడు అదే వెంకటేశ్‌ని డైరెక్ట్‌ చేస్తున్నారు. దాంతో ‘ఆదర్శకుటుంబం’ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశమంత ఏర్పడ్డాయి. అక్టోబర్‌ 2న గాంధీజయంతి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ అసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. వెంకటేశ్‌ చిత్ర విజయాల్లో ‘కూలీ నెం 1’ సినిమా ఒకటి. ఆ సినిమాలోని ‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా.. దయుంచయ్యా దేవా..’ సాంగ్‌ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. వినాయకచవితి పందిళ్లలో నేటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంది. ఆ పాటను ఈ సినిమా కోసం రీమేక్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే.. సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణ కాకమానదు. ైక్లెమాక్స్‌, ఓ పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని టాక్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి కథానాయిక. నివేదా పేతురాజ్‌, యువిన, రాజ్‌ ప్రజ్వల్‌, రావురమేశ్‌, సత్య, బ్రహ్మాజీ ఇతర పాత్రధారులు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈచిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే

Original source: ntnews.com
Read more on Kaizer News