న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన వేదికను శుద్ధి చేయడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఇదే అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా శనివారం స్పందించారు. ఈ ఘటన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. దళితులు అభివృద్ధి చెందడం, గౌరవంగా జీవించడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఇష్టం లేదని విమర్శించారు. ఖర్గేకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. శుద్ధీకరణకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్‌పై కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అంటరానితనాన్ని సమర్థించే వారిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా, ఆగస్టు 8న హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో ఖర్గే సభ నిర్వహించారు. అనంతరం శ్రీరామ్ సేనకు చెందినవారు అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేశ్ గోదియాల్ ఆరోపించారు. ఈ సంస్థకు బీజేపీతో సంబంధాలున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది