Kaizer News

భీమిలి కేజీబీవీలో బాలికల జుట్టు కత్తిరింపు

భీమిలి కేజీబీవీలో బాలికల జుట్టు కత్తిరింపు

· State - Telangana · prabhanews.com

సుమారు పది మంది విద్యార్థినుల జుట్టు కత్తిరింపు.. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి, ఆంధ్రప్రభ : భీమిలి కృష్ణాపురంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సుమారు పది మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన ఘటనపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్‌ గంగాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. బుధవారం రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విషయం మరుసటి రోజు వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు. ఇప్పటికే విద్యార్థులతో పోలీసులు మాట్లాడారని, ఘటన ఎలా జరిగిందనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. బయట వ్యక్తులు డార్మిటరీలోకి ప్రవేశించే అవకాశం లేదని, సీసీ కెమెరాల పరిశీలనతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌ గంగా మాట్లాడుతూ ఘటన మరుసటి రోజు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను పలుమార్లు ప్రశ్నించినా జుట్టు ఎవరు కత్తిరించారో చెప్పలేదన్నారు. నైట్‌ డ్యూటీ సిబ్బందిని కూడా విచారించినట్లు తెలిపారు. రెండు డార్మిటరీల్లో సుమారు పది మంది తొమ్మిదో తరగతి విద్యార్థినుల జుట్టు కత్తిరించినట్లు గుర్తించామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. డార్మిటరీలో సీసీ కెమెరాలు లేవని, ప్రవేశ ద్వారం, కారిడార్‌లో మాత్రమే కెమెరాలు ఉన్నాయని వివరించారు. విద్యార్థుల్లో ఎవరో సహకరించి ఉండవచ్చన్న అనుమానం ఉందన్నారు. నగరంలో నెలకొన్న నీటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలిలో నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు బల్క్‌ వాటర్‌ అందించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ నేతలు నీటి సమస్యపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో పాటు ప్రస్తుతం మరో 20 వేల పట్టాలు అందించి సుమారు 30 వేల కుటుంబాలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టామని తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News