మాంసాహార వ్యర్థాలతో పెరుగుతున్న కుక్కల బెడద.. ప్రజల్లో ఆందోళన నర్సంపేట, ఆంధ్రప్రభ: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుక్కల శరీరాలపై దురదలు, చర్మ సమస్యలు, పుండ్లు కనిపిస్తుండటం మరింత కలవరానికి గురిచేస్తోంది. వీధుల్లో వచ్చే పోయే వారిని కుక్కలు వెంటపడటం, కరిచేందుకు ప్రయత్నించడం, ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను చిందరవందర చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పట్టణం, గ్రామాల్లోని చికెన్ సెంటర్లు, మటన్ దుకాణాలు, చేపల విక్రయ కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలను కొందరు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాంసాహార వ్యర్థాల కోసం కుక్కలు గుంపులుగా చేరి పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయని అంటున్నారు. బహిరంగంగా పడేసిన వ్యర్థాల కారణంగా కోతులు, ఇతర జంతువులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ వ్యర్థాలు త్వరగా కుళ్లిపోవడంతో దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు పెరిగి పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. చికెన్, మటన్, చేపల వ్యాపారులు వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణపై వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు బహిరంగంగా మాంసాహార వ్యర్థాలు పడేస్తున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వ్యర్థాలను తొలగించడం మాత్రమే కాకుండా వాటి మూలాన్ని నియంత్రిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. వీధి కుక్కల సమస్యపై స్థానిక సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్న కుక్కలను గుర్తించి సంబంధిత పశువైద్య అధికారుల ద్వారా పరీక్షలు, చికిత్స అందించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ప్రజారోగ్యంతో పాటు పరిసరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్యాన్ని మెరుగుపరిచి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు