Kaizer News

50 Years School Reunion | 50 ఏళ్ల తర్వాత స్కూల్‌కు

50 Years School Reunion | 50 ఏళ్ల తర్వాత స్కూల్‌కు తిరిగొచ్చిన స్నేహితులు.. విద్యార్థుల్లా మారి సందడి!

· State - Telangana · prabhanews.com

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్‌: చి న్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు.. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. కానీ ఐదు దశాబ్దాలు గడిచినా వారి స్నేహం మాత్రం కొనసాగింది. తాజాగా 1976 బ్యాచ్‌కు చెందిన కొందరు స్నేహితులు మళ్లీ ఒకచోట చేరారు. అయితే ఈ రీయూనియన్‌ను కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలని భావించి.. ఏకంగా తమ స్కూల్‌ రోజుల వేషధారణలోనే పాత పాఠశాలకు వెళ్లారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. స్కూల్‌కు వెళ్లే ముందు అందరూ తమ పాత రోజులను గుర్తుచేసేలా షర్ట్‌, ప్యాంట్‌ ధరించారు. భుజాలకు బ్యాగులు వేసుకున్నారు. మెడలో చిన్నపిల్లలు ఉపయోగించే వాటర్‌ బాటిళ్లు కూడా తగిలించుకున్నారు. దీంతో వాళ్లను చూస్తే నిజంగానే మరోసారి స్కూల్‌కు బయలుదేరిన విద్యార్థుల్లా కనిపించారు. ఏళ్ల తర్వాత పాత స్కూల్‌ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన స్నేహితుల్లో ఉత్సాహం కనిపించింది. ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ, చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న ప్రదేశంలో మళ్లీ కలిసి గడపడం వారికి ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. రీయూనియన్‌ కేవలం కబుర్లకే పరిమితం కాలేదు. చిన్నప్పుడు ఆడిన పిట్టూ ఆటను మళ్లీ ఆడుతూ సందడి చేశారు. అనంతరం అందరూ వరుసగా నిలబడి స్కూల్‌ రోజుల్లో సరదాగా చేసే ‘ట్రైన్‌ డ్యాన్స్‌’ను కూడా చేశారు. వయసు పెరిగినా.. ఆ క్షణాల్లో మాత్రం మళ్లీ తమ చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోయారు. తాము చిన్నప్పుడు నవ్విన, ఆడిన, స్నేహాలు పెంచుకున్న అదే స్కూల్‌కు మళ్లీ వెళ్లి ఆ జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు దశాబ్దాల తర్వాత అదే ప్రదేశంలో మళ్లీ కలుసుకోవడం వారి రీయూనియన్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ రీయూనియన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కూడా తమ స్కూల్‌ స్నేహితులు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొందరు తమ పాత స్నేహితులను ఇంకా కలవలేకపోయామని చెప్పగా.. మరికొందరు ఈ వీడియో చూసి ఆనందంగా అనిపించిందని కామెంట్‌ చేశారు. ఐదు దశాబ్దాల తర్వాత కూడా స్నేహం అలాగే ఉండొచ్చని ఈ రీయూనియన్‌ చూపించింది. ఒకరోజు కోసం విద్యార్థుల్లా మారిన ఈ స్నేహితులు.. తమ పాత స్కూల్‌లో మళ్లీ చిన్ననాటి ఆనందాన్ని ఆస్వాదించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News