Kaizer News

వరుణుడి కరుణ కోసం రైతుల యాగం

వరుణుడి కరుణ కోసం రైతుల యాగం

· State - Telangana · prabhanews.com

చిన్నంబావి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పెద్దమారూరు గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ రైతులు, గ్రామస్తులు ఆదివారం ప్రత్యేక యాగం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలోని దేవతామూర్తులకు కృష్ణానది జలాలతో అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరుణుడి కరుణ కోసం ఈసారి ప్రత్యేకంగా పూజలు, యాగం నిర్వహించారు. ఉదయం భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ కృష్ణానదికి వెళ్లి బిందెలతో జలాన్ని తీసుకువచ్చి దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. చిన్నంబావి మండలంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉండగా, వేలాది ఎకరాల్లో సాగు కొనసాగుతోంది. ఒకటి కాదు, రెండు మూడు పంటలు పండించేందుకు అనువైన సాగునీటి వనరులు ఉన్నప్పటికీ, వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేఘాలు కనిపిస్తూ ఆశలు రేకెత్తిస్తున్నా, సరైన వర్షాలు మాత్రం కురవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించి త్వరగా వర్షాలు కురిపించాలని రైతులు, గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News