Kaizer News

ఏకం రూపం బహుధా

ఏకం రూపం బహుధా

· State - Telangana · ntnews.com

ఏకో వశీ సర్వభూ తాన్తరాత్మా ఏకం రూపం బహుధా యః కరోతి, త మాత్మస్థం యే‚ను పశ్యన్తి ధీరా స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌. ‘సమస్తాన్నీ తన స్వాధీనంలో ఉంచుకొని, సమస్త ప్రాణులలోని ఒకే అంతరాత్మ తన ఏకైక రూపాన్ని అనేక విధాలుగా భాసింపజేస్తున్నది. తమ ఆత్మలోని ఈ తత్వాన్ని దర్శించే జ్ఞానులకు మాత్రమే శాశ్వత సుఖం కలుగుతున్నది’ అని పై ఉపనిషత్‌ వాక్యానికి భావం. సర్పరూపం ధరించిన అఘాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు కృష్ణుడు. తర్వాత గోపాలకులతో కలిసి చెరువు గట్టున కూర్చొని సద్దిమూటలు విప్పి ఒకరు తెచ్చుకున్నది మరొకరు పంచుకొని తింటారు. భోజనం పూర్తయ్యాక చూస్తే ఒక్క ఆవు కూడాకనిపించదు. కృష్ణుడు… శ్రీ మహావిష్ణువేనా అన్నది తేల్చుకోవడానికి బ్రహ్మదేవుడు ఆవులన్నిటినీ కొందరు గోపాలురతో సహా మాయం చేసి చాలాదూరం తీసుకెళ్తాడు. ఒక బిలంలో దాచి వారికి ఆహారం ఏర్పరచి తన లోకానికి వెళ్లిపోతాడు. గోపబాలురు ఎంతసేపైనా రాకపోయేసరికి బలరామకృష్ణులు చుట్టూ వెతుకుతారు. ఇదేదో మాయ అని కృష్ణుడు దివ్య దృష్టితో చూస్తే బ్రహ్మ చేసిన పని తెలిసింది. తనలో తాను నవ్వుకున్నాడు కృష్ణుడు. ఎంతమంది గోపాలురు, ఎన్ని ఆవులు కనిపించకుండా పోయాయో అంతమంది గోపాలురుగా అన్ని ఆవులుగా కృష్ణుడు ఒక్కడే రూపాలూ ధరించాడు. ఏ గోపాలుడు ఏ ఇంటికి వెళ్లాలో ఆ ఇంటికే వెళ్లాడు. ఏ ఆవు ఏ ఇంటికి వెళ్లాలో ఆ ఇంటికే వెళ్లింది. ప్రతి రోజూ ఉదయం గోపాలురు గోవులను మేపడానికి తీసుకువెళ్లేవారు. సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అంతా మామూలే! ఇలా ఏడాది గడిచింది. కృష్ణుడు తన దగ్గరికి రానందుకు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి యమునా తీరానికి వస్తాడు. తాను అపహరించిన ఆవులన్నీ అక్కడ కనిపిస్తాయి. గోపాలకురంతా అక్కడే ఉంటారు. అవన్నీ కృష్ణుడు ధరించిన రూపాలే అని బ్రహ్మ గ్రహిస్తాడు. భువనాలనే ప్రభవింపజేసే శ్రీ మహావిష్ణువుకు ఆవులను, గోపాలురను సృజింపజేయడం ఒక లెక్కా! అనుకొని పరమాత్మ పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు బ్రహ్మ. తాను దాచిన గోపాలురను తెచ్చి తిరిగి కృష్ణుడికి అప్పగిస్తాడు

Original source: ntnews.com
Read more on Kaizer News