Shorts Banaganapalle: బనగానపల్లె రింగ్ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాయిబాబా ఆలయం నుంచి రవ్వలకొండ వరకు కొనసాగుతున్న రింగ్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. రూ.56 కోట్ల అంచనా వ్యయంతో 10.68 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ రింగ్ రోడ్డు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే బనగానపల్లె పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రావడంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి బనగానపల్లె పట్టణంలోని ప్రధాన కూడళ్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బనగానపల్లె పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రింగ్ రోడ్డు పూర్తితో పట్టణానికి మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడటంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణ మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు