Shorts బిచ్కుంద (కామారెడ్డి ): బిచ్కుంద పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) నాల్గవ జాతీయ మహాసభలకుసంబంధించిన పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయం, ఆహార మార్కెట్లపై కార్పొరేట్ ప్రభావం పెరుగుతోందని, గ్రామీణ పేదలు భూమి, ఉపాధి, వేతనాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, రుణమాఫీ వంటి అంశాలపై ఈ జాతీయ మహాసభలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామీణ సంక్షేమం, భూమిహక్కులు, ఉపాధి, సామాజికసమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని 20రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతారని, రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.సాయిబాబా, జాదవ్ బాబు నాయక్, రాథోడ్ శంకర్,గొనె బాలయ్య, గొనె మారుతి, జాదవ్ గోవింద్, పిట్ల లక్ష్మణ్, నాగమణి,దీప్ చంద్, సాయిలు తదితర నాయకులు పాల్గొన్నారు