Shorts వరంగల్: వరంగల్లో గణపతి నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. శివనగర్ లో కరెన్సీ గణపతి నగరవాసులను ఆకట్టుకుంటున్నది. గత 23 సంవత్సరాలుగా ఇక్కడ నవరాత్రి వేడుకలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. పది సంవత్సరాల నుంచి మట్టి గణపతిని పూజిస్తున్నారు. రూ.51 లక్షలతో మొదట గణపతి అలంకరించగా, ప్రతి ఏటా ఆ మొత్తాన్ని పెంచుతూ ఈ ఏడాది రూ.1.91కోట్లతో వినాయకున్ని అలంకరించారు. స్థానికులు కరెన్సీతో అలంకరించబడిన లంబోదరుణ్ణి చూడడానికి బారులు తీరారు. ప్రత్యేక పర్యవేక్షణ మధ్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 150-200 మందితో ఉత్సవ సమితి ఉంది. ప్రతిరోజు ఉదయం గణపతి పూజ, హోమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరెన్సీ అలంకరించిన రోజు డ్రా పద్ధతిన రెండు జంటలకు, అధ్యక్ష కార్యదర్శుల దంపతులకు పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ ఏడాది డ్రా లో రమేష్, శ్రీనివాస్ దంపతులు, అధ్యక్షుడు దామోదర్, కార్యదర్శి అశోక్ దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. వినాయక నవరాత్రుల కోసం రూ.35 లక్షలతో స్థలం కొనుగోలు చేశామని, రూ.25 లక్షలతో త్వరలో షెడ్ నిర్మాణం చేసి నగరంలోనే ప్రత్యేకతను చాటుతామని ఆయన స్పష్టం చేశారు. ఉత్సవ సమితి కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, సత్యనారాయణ, కిషోర్, వేణు తదితరుల పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు