ఏళ్ల సేవ.. భద్రత లేని కొలువు నల్లబ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన క్రమబద్ధీకరణతో పాటు పూర్తి వేతనం డిమాండ్ ఉద్యోగి మృతికి రూ.50 లక్షల పరిహారం కోరిన జేఏసీ సెప్టెంబరు 7లోగా స్పందించాలి.. 8 నుంచి విధుల బహిష్కరణ హెచ్చరిక విజయవాడ, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న ఉద్యోగుల ఆందోళన గళం మరింత బలపడింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో ఎన్టీఆర్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో కాంట్రాక్ట్ సిబ్బంది మానవహారం నిర్వహించారు. రోగుల సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు పగలు, రాత్రి తేడా లేకుండా సేవలందిస్తున్నా, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఉద్యోగులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని జేఏసీ డిమాండ్ చేసింది. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి చెందితే కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని, ఈపీఎఫ్ సౌకర్యం, ఆరోగ్య కార్డులు, అనారోగ్య సమయంలో పూర్తి వేతనంతో సెలవులు మంజూరు చేయాలని కోరింది. ఒకే చోట సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి అభ్యర్థన, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సెప్టెంబరు 7లోగా స్పందించి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో సెప్టెంబరు 8 నుంచి విధులను బహిష్కరించాల్సి వస్తుందని జేఏసీ హెచ్చరించింది. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఎం. ప్రభావతి, కోశాధికారి రాజ్‌కుమార్, జిల్లా అధ్యక్షురాలు డి. పద్మతో పాటు పలువురు నాయకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు