కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన యువకుడు విగతజీవిగా.. పాలకుర్తి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చోటుచేసుకున్న ఓ యువకుడి మృతి ఘటన స్థానికంగా విషాదాన్ని నింపడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలోని బిక్యా నాయక్ తండాకు చెందిన 25 ఏళ్ల ప్రేమ్‌కుమార్ ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం జనగామ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అతడు తిరుగుతూ కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే దేవరుప్పుల మండలం కోలుకొండ గుట్టల్లో ప్రేమ్‌కుమార్ మృతదేహం లభించడం కలకలం రేపింది. మృతదేహం కుళ్లిపోయి, ముఖం నల్లగా మారి దుర్వాసన వస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రేమ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేసి గుట్టల్లో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రేమ్‌కుమార్ మృతికి గల కారణాలు, అక్కడ అసలేం జరిగిందనే విషయాలు పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది