కేసీ కెనాల్, హంద్రీనీవాలో ఏర్పాట్లు ప్రజలు ఎక్కడైనా నిమజ్జనం చేసుకోవచ్చు పెద్ద విగ్రహాలకు హంద్రీనీవాలో అనుకూలం ఇటివల 350 విగ్రహాల నిమజ్జనం రెండు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించేందుకు కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్‌తో పాటు నన్నూరు టోల్‌గేట్ వద్ద హంద్రీనీవాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం నన్నూరు టోల్‌గేట్ వద్ద హంద్రీనీవా, వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్‌లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యుల విజ్ఞప్తి మేరకు వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్‌లోనే గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుంకేసుల బ్యారేజ్‌లో నీటి లభ్యత లేకపోవడంతో కేసీ కెనాల్‌కు నీరు వచ్చే అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్‌కు రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. పంప్‌హౌస్ నుంచి ప్రతిరోజూ వెలువడే సుమారు 20 లక్షల లీటర్ల వాష్ వాటర్‌ను వినాయక ఘాట్ వద్ద నిల్వ చేసి, భక్తులు సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నన్నూరు టోల్‌గేట్ వద్ద హంద్రీనీవాలో నీటి ప్రవాహం అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే హంద్రీనీవాలో 350కి పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారని పేర్కొన్నారు. భక్తులు తమకు అనుకూలమైన ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇరిగేషన్, కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గాయత్రి గోసేవ సమితి ప్రతినిధులు భక్తులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు