Shorts నాగర్‌కర్నూల్: నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌తో పాటు అవసరమైన ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సాచ్యురేషన్ మోడ్స్ ఏర్పాటు చేసి నెట్‌వర్క్ సేవలను విస్తరించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటు, భూసేకరణ, అనుమతులపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో టవర్ల ఏర్పాటుతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీశాఖ నిబంధనలను పాటించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులకు మెరుగైన నెట్‌వర్క్ సేవలు అందేలా అవసరమైన చోట బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. మెరుగైన కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వ, అత్యవసర, డిజిటల్ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూమి, అనుమతుల విషయంలో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు వాసు మరికంటి, సుధీర్, సురేష్ నరసయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శోభ తదితరులు పాల్గొన్నారు