ఆసీస్ షార్క్.. దాడి Andhra Prabha Top News ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో షార్క్ దాడులు కలవరపెడుతున్నాయి. పర్యాటకులు, ఈతగాళ్లకు ప్రసిద్ధి చెందిన పెర్త్ నగరంలోని సోరెంటో బీచ్‌లో శుక్రవారం ఓ వ్యక్తిపై షార్క్ దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. పెర్త్ పరిసరాల్లోని తీర ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర బీచ్‌లను మూసివేశారు. శనివారం కూడా బీచ్‌ల మూసివేత కొనసాగింది. పెర్త్ నగర కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోరెంటో బీచ్‌లో ఈత కొడుతున్న ఓ వ్యక్తిపై షార్క్ విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో స్థానిక కౌన్సిల్ శుక్రవారం ఫేస్‌బుక్ ద్వారా బీచ్‌ల మూసివేతను ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు (స్థానిక సమయం) బీచ్‌లను తెరవబోమని స్పష్టం చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో వరుసగా చోటుచేసుకుంటున్న షార్క్ దాడులు స్థానికులను, పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం కూడా పెర్త్‌కు సుమారు 400 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న జెరాల్డ్‌టన్ పట్టణ తీరంలో ఓ సర్ఫర్‌పై షార్క్ దాడి చేసింది. ఈ ఘటనలో అతడి పాదం తెగిపోగా.. కాలికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో గత కొన్ని నెలలుగా షార్క్ దాడులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. జూన్‌లో రాష్ట్ర దక్షిణ తీరంలో స్పియర్‌ఫిషింగ్ (ఈటెతో చేపలు వేటాడటం) చేస్తుండగా 35 ఏళ్ల వ్యక్తి షార్క్ దాడిలో మృతి చెందాడు. అంతకుముందు మేలో పెర్త్ సమీపంలోని ఓ ద్వీపం వద్ద 38 ఏళ్ల వ్యక్తి షార్క్ దాడికి బలయ్యాడు. తాజా ఘటనతో తీర ప్రాంతాల్లో భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస దాడుల నేపథ్యంలో బీచ్‌ల వద్ద ఆంక్షలు, పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. మూసివేసిన తీర ప్రాంతాలను ఎప్పుడు తిరిగి తెరుస్తారనే దానిపై అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది