అధికార పార్టీ సభ్యుల నుంచీ విమర్శలు ఐదారుగంటలే కరెంట్ సరఫరా సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం: ఏలేటి, కూనంనేని హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కోతలు.. వ్యవసాయ విద్యుత్తుకు కరెంట్ అందకపోవడంపై రాష్ట్ర అసెంబ్లీ హీటెక్కింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలు గళమెత్తారు. శుక్రవారం జీరో అవర్‌లో విద్యుత్తు కోతలను ప్రస్తావించారు. ప్రతిపక్ష సభ్యులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తోడయ్యారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడంలేదని ఆరోపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రస్తావించారు. రైతులు ఆందోళనకు దిగుతున్నారని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రస్తావించారు. రోజుకు ఐదారు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. మోటర్లు పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ఎల్ నినో సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరెంట్ సరఫరా చేసి రైతులకు అండగా నిలువాలని సూచించారు. విద్యుత్తు కోతల సమస్య తీవ్రంగా ఉన్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. రైతులు ధర్నాలకు దిగుతున్నారని, ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందని తెలిపారు. విద్యుత్తు సర్దుబాటు చేసి అందించాలని కోరారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ప్రస్తావించారు. మంత్రి చొరవ తీసుకుని ఈ ఇబ్బందులను తొలగించాలని కోరారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఇండ్లపై ఉన్న ఎల్‌టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి. దీంతో సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలుచోట్ల కర్షకులు నిరసనకు దిగారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నదని సీపీఐఎల్పీ నేత కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 300 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 130 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉన్నదని తెలిపారు. 170 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. కొత్తగూడెం (కేటీపీఎస్)లో స్థలమున్నదని, అన్ని రకాల వసతులున్నాయని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రానికి వెళ్తే రాత్రిపూట కరెంట్ వస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఎల్ నినో ప్రభావంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు, నీటి సమస్య