Kaizer News

Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేద్కర్ విగ

Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి: అఖిలేష్ యాదవ్

· National - India · ntnews.com

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయితే కేవలం 14 కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నంలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసకాండ జరిగిందని ఆయన విమర్శించారు. (Akhilesh Yadav) ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని 72 జిల్లాల్లో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహాలు 151 వరకు ధ్వంసమైనట్లు తెలిపారు. తమ పార్టీ గుర్తించిన సంఘటనలు, పోలీస్‌ కేసులు, ప్రభుత్వ సమాచారం ఆధారంగా ఈ లెక్క తేల్చినట్లు చెప్పారు. ‘బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహాలే అత్యధికంగా ధ్వంసమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో 72 జిల్లాల్లో 151కు పైగా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం లేదా పాడుచేయడం జరిగాయి’ అని ఆయన అన్నారు. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన విధ్వంసకాండ ఉద్దేశపూర్వకంగా జరిగిందని అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నంతో దీనిని ముడిపెట్టారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని వారు (బీజేపీ) భావించినప్పటికీ అందులో విఫలమయ్యారు. అందుకే ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరిగింది. బీజేపీ, ఆ భావజాలం కలిగిన వారు దాడి చేసినప్పుడు, వారు మొదటగా లక్ష్యంగా చేసుకునేది చేతిలో ఉండే రాజ్యాంగ ప్రతిని’ అని విమర్శించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన కేసుల వివరాలను సమాజ్‌వాదీ పార్టీ స్వయంగా సేకరించిందని అఖిలేష్‌ యాదవ్ తెలిపారు. ‘మొత్తంగా మేం 151 కేసులను నమోదు చేయగలిగాం. సగటున లెక్కించి చూస్తే, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏటా 15కు పైగా అంబేద్కర్‌ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. నమోదు కాని లేదా లెక్కలోకి రాని కేసులు కూడా ఉండవచ్చు’ అని అన్నారు. అయితే ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ కేవలం 14 కేసుల్లోనే అరెస్టులు జరిగాయని అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. 45 కేసుల్లో గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఎనిమిది కేసుల్లో నిర్దిష్ట వ్యక్తుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్లు చెప్పారు. 84 కేసుల్లో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌ను గానీ, ఆయన విగ్రహాలను గానీ, లేదా ఆయన అనుచరులను గానీ గౌరవించలేదని అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆ తర్వాత జిల్లాల వారీగా అంబేద్కర్‌ విగ్రహాలు ధ్వంసమైన గణాంకాలను ఆ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది

Original source: ntnews.com
Read more on Kaizer News