జైనూర్, ఆంధ్రప్రభ: ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఏజెన్సీ షెడ్యూల్ కులాల పోరాట జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల వారు తరతరాలుగా గిరిజనులతో కలిసి జీవిస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్సీలకు ప్రభుత్వ పథకాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పహనీలతో పాటు సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో దళితులకు 18 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ దావుల రమేష్, జిల్లా నాయకులు ఘాటె రామారావు, కర్లపూడి సుందర్ పాల్, మెంథన కొండలరావు, జైనూర్ మండల అధ్యక్షుడు అసాధ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు