భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సకల కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో న సకల కళాకారుల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నట్లు జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.. జిల్లాలోని కళాకారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళాకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, కళాకారుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖకు ప్రాధాన్యత ఇస్తూ కళాకారులకు గుర్తింపు కల్పిస్తున్నందుకు జేఏసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐదవ వార్డు కౌన్సిలర్ పూర్ణచందర్, నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ జిల్లా చైర్మన్ మేకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు