Kaizer News

వారబందీ పద్ధతిలో సాగునీరు అందించాలి..

వారబందీ పద్ధతిలో సాగునీరు అందించాలి..

· State - Telangana · prabhanews.com

రిజర్వాయర్లలోని నీటిని రైతులకు అందేలా చర్యలు: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులతో సమన్వయం చేసుకుని వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలను వారికి వివరించి, సాగునీటిని పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని రైతులకు ఉపయోగపడే విధంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నిల్వ ఉన్న నీటిని వారబందీ పద్ధతిలో రైతులకు అందించే విషయాన్ని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి వెంటనే తీసుకెళ్లి, నవంబర్ వరకు వారబందీ విధానంలో సాగునీరు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. నీరు వృథా కాకుండా పంటలకు అవసరమైన మేరకు వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సాగునీటి వినియోగంపై తగిన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు రమేష్‌నాయుడు, మాజీ సర్పంచులు రఘువర్ధన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నాయకులు కురుమన్న, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News