Kaizer News

ప్రజల శ్రేయస్సే లక్ష్యం..

ప్రజల శ్రేయస్సే లక్ష్యం..

· State - Telangana · prabhanews.com

అర్హులకు రేషన్‌ కార్డులు.. పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ నవాబుపేట, ఆంధ్రప్రభ: ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, వారికి సేవలందించడమే తన లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి అన్నారు. శనివారం నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. నవాబుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలను పంపిణీ చేశారు. అనంతరం దాయపంతుపల్లి, హజిలాపూర్‌, రాంసింగ్‌ తండా, కొండాపూర్‌, రుద్రారం తదితర గ్రామాల్లో అర్హులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. తిగలపల్లి, సిద్దోటం, కారుకొండ గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కారుకొండలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామని, పరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కారుకొండ గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రూ.2.50 కోట్లతో 10 పడకల ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నవాబుపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు కానుందని తెలిపారు. హన్మపల్లి, కూచూర్‌, చెన్నారెడ్డిపల్లి, కారూర్‌, ఇప్పటూరు, ఎన్మన్‌గండ్ల తదితర గ్రామాల్లోనూ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సురేష్‌, ఏఎంసీ చైర్మన్‌ హరలింగం, సర్పంచులు గీతారాణి, కమలమ్మ, లక్ష్మమ్మ, జ్యోతి, రాఘవేందర్‌, మల్లేష్‌గౌడ్‌, రవి, ఆల సంతోషి, రవికిరణ్‌, శంకర్‌, నవనీత, రంజిత్‌గౌడ్‌, భీమయ్య, సుమతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సురేష్‌, నాయకులు భూపాల్‌రెడ్డి, వాసుయాదవ్‌, బలరాజ్‌, పోలీస్‌ విక్రమ్‌, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News