కేసీఆర్‌పై విమర్శలు, రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు బీఆర్‌ఎస్ ఆగ్రహం.. సస్పెన్షన్‌కు డిమాండ్ ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : సోషల్ మీడియాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన రాజకీయ పోస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న వివేక్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి “కేసీఆర్ ఆగం చేసిండు, రేవంతన్న ఆదుకుండు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ‘ఇందిరమ్మ ఇండ్లు రాజాపేట’ వాట్సాప్ గ్రూప్‌లో ఏఈ వివేక్ ఈ పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఆయన ప్రశంసించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేలా, మాజీ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనకు దిగారు. ఏఈ వివేక్ ప్రవర్తనను నిరసిస్తూ అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావును కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు తమ నిరసనను విరమించారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, నాయకులు గుంటి మధుసూదన్ రెడ్డి, చామకూర గోపాల్ గౌడ్, ఎర్రగొకుల జశ్వంత్, పల్లె సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు