Kaizer News

Guntur: ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ల సవరణలు పరిగ

Guntur: ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ల సవరణలు పరిగణించాలి!

· State - Telangana · hmtvlive.com

Shorts Guntur: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే తేదీ వరకు ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, చేర్పులు, తొలగింపులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకుడు కొక్కెర శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమగ్రంగా వినతిపత్రం అందజేశామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు 2025 డిసెంబరు 31 నాటికి ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితాలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత కొత్త ఓటర్ల చేరికలు, తొలగింపులు, చిరునామాల మార్పులు తదితర సవరణలు పెద్ద సంఖ్యలో జరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నందున, ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి అందుబాటులో ఉన్న తుది వివరాలను మున్సిపల్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తమ వినతిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక సమాధానం అందిందని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగిన తదుపరి సవరణల వివరాలను సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి తీసుకుని పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని సమాధానంలో పేర్కొన్నట్లు వివరించారు. అర్హత కలిగిన ఓటర్లకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చాలని తాము కోరడం లేదన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా జాబితాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఓటర్లలో అనవసరమైన ఆందోళనలు, అపోహలు లేకుండా ఎన్నికల ప్రక్రియపై స్పష్టత కల్పించాలని కోరారు. తమ వినతిని పరిశీలించి స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు శ్రీనివాస్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.వి. ప్రసాద్, అనంతరామయ్య, బి.వి.వి.ఎల్.ప్రసాద్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News