Shorts Supreme Court: సంపూర్ణ మద్య నిషేధం అనేది అసలు సమస్యను పరిష్కరించకపోగా, అనేక ఇతర కష్టనష్టాలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిషేధం ఉన్న ప్రాంతాల్లో అక్రమ సారా వ్యాపారాలు, కల్తీలు, దొంగచాటు రవాణా, రహస్యంగా మద్యం సేవించడం వంటి అనర్థాలు పెరుగుతాయని హెచ్చరించింది. కల్తీమద్యం మరణాల నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనలను కొట్టివేస్తూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మద్య నిషేధం అమలులో ఉన్న తీరుపై సుప్రీంకోర్టు స్పందిస్తూ గుజరాత్ రాష్ట్రాన్ని ఉదాహరణగా పేర్కొంది. సంపూర్ణ మద్య నిషేధం వల్ల ప్రభుత్వాలు పన్ను రాబడులను కోల్పోవడంతో పాటు, నిషేధం అమలు కోసం భారీగా ఖర్చుపెట్టాల్సి వస్తోందని తెలిపింది. గుజరాత్‌లో కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ, అక్కడ అనేకసార్లు ఘోరమైన సారా విషాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. కల్తీమద్యం మరణాలను నివారించేందుకు గాను ఔషధేతర తయారీదారులకు విక్రయించే మిథనాల్‌కు రంగు, చేదు రుచిని జోడించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ మేరకు వెలువరించిన తీర్పులో ధర్మాసనం పలు కీలక అంశాలను వెల్లడించింది. రంగు, రుచిని మార్చడం ద్వారా లేదా మద్యం అందుబాటులో లేకుండా చేయడం ద్వారా తాగుబోతుల్లోని తీవ్రమైన తృష్టను (వ్యసనాన్ని) ఆపలేమని కోర్టు పేర్కొంది. దీనికి బదులుగా ఎక్సైజ్ చట్టాలను కఠినతరం చేసి, మద్యం రవాణా, నిల్వ, తయారీపై గట్టి నియంత్రణలను అమలు చేయడమే ఉత్తమమని సూచించింది. మిథనాల్‌కు రంగు, చేదు రుచిని కలపాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు రాజ్యాంగబద్ధంగా లేవని, అవి ఔషధేతర ఉత్పత్తిదారుల పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను