ముంబై, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోని నవి ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దిఘా ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించి గోడౌన్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. గోడౌన్‌లో ఫర్నిచర్ వస్తువులు పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు మరింత తీవ్రంగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో పాటు భారీగా మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పలు ఫైరింజన్లను రంగంలోకి దించారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే వారి పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అలాగే, దిఘాలోని ఫర్నిచర్ గిడ్డంగిలో సంభవించిన అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక చర్యలు పూర్తయిన తర్వాత, ప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టం వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది