వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐదు రోజుల పాటు పూజలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని నున్న గ్రామంలోని వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీ వినాయక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కళాశాల చైర్మన్ ఎన్.శైలజ, సెక్రటరీ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఐదు రోజుల పాటు పూజల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో కళాశాల ప్రాంగణం ఐదు రోజుల పాటు భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. ఐదో రోజు శనివారం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శ్రీ వినాయక విగ్రహాన్ని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. భక్తులు ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా’ అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు విద్యార్థుల్లో భక్తి, ఐక్యత, క్రమశిక్షణ, సోదరభావం, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఐదు రోజుల పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు