Kaizer News

నోట దేశభక్తి.. చేతల్లో విభజన కుట్రలా?

నోట దేశభక్తి.. చేతల్లో విభజన కుట్రలా?

· State - Telangana · prabhanews.com

దారుణమైనది ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర త్రివర్ణ పతాకం, రాజ్యాంగంపై గత వైఖరి ఘోరం కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జ్ వల్లూరు భార్గవ్‌ విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ : నోట దేశభక్తి మాటలు చెబుతూ.. చేతల్లో విభజన రాజకీయాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌చార్జి భార్గవ్‌ వల్లూరు ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర, ఆ సంస్థ భావజాలం, స్వాతంత్ర్య ఉద్యమం, రాజ్యాంగం, జాతీయ పతాకం విషయంలో గతంలో అనుసరించిన వైఖరిపై దేశంలో చాలాకాలంగా చర్చ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ గత వైఖరిని ప్రస్తావిస్తూ.. 1947లో త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా రాజ్యాంగ సభ ఆమోదించిన అనంతరం కూడా ఆ సంస్థలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాగ్‌పూర్‌ ప్రధాన కార్యాలయంలో 1947, 1950లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం 2002 వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదన్న చారిత్రక అంశంపై కూడా ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగం విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ గత వైఖరిపై చర్చ అవసరమని భార్గవ్‌ వల్లూరు అన్నారు. 1949లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం ఎత్తివేతకు సంబంధించి సంస్థ రాజ్యాంగానికి విధేయత, జాతీయ పతాకాన్ని అంగీకరించడం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి విదేశాలకు వెళ్లి దేశానికి నీతులు చెప్పడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ను విశ్వసించే వారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశభక్తి నినాదాలు చేయడం మాత్రమే కాదని.. భారత రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించి ఆచరించడమే నిజమైన దేశభక్తి అని స్పష్టం చేశారు. భారతదేశం అంటే ఒకే మతం, ఒకే భాష, ఒకే వర్గం కాదని.. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అని భార్గవ్‌ వల్లూరు అన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో ప్రజలను విడదీసి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. విభజించి పాలించడం కాకుండా ప్రజలను కలిపి, రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. దేశాన్ని ఒకటిగా నిలిపేది ద్వేషం కాదని.. రాజ్యాంగమేనని, దేశాన్ని ముందుకు నడిపేది విభజన కాదని.. ఐక్యతేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.. భారత త్రివర్ణ పతాకం ఎగరాలి.. భారతదేశ ఐక్యత, సమగ్రత చిరస్థాయిగా నిలవాలి అని భార్గవ్‌ వల్లూరు పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News