చెరువులో గల్లంతైన వ్యక్తి మృతి.. గాలింపు తర్వాత లభ్యమైన మృతదేహం జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జామిని పంచాయతీ పరిధిలోని సాంబాజిగూడ చెరువులో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం విషాదంగా మారింది. జామిని గ్రామ సమీపంలోని చెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు గల్లంతైన ముండే రజనీకాంత్ (35) మృతి చెందాడు. రజనీకాంత్ చెరువులో గల్లంతైన వెంటనే గ్రామస్తులు, పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. నీటిలో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శనివారం మధ్యాహ్నం రిస్క్ టీమ్ సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మధ్యాహ్నం తర్వాత రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. రజనీకాంత్ ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతై మృతి చెందడంతో జామిని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు