Kaizer News

TG | చెరువులను కాపాడేందుకు కీలక నిర్ణయాలు…

TG | చెరువులను కాపాడేందుకు కీలక నిర్ణయాలు…

· State - Telangana · prabhanews.com

చిన్న నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణకు కీలక సూచనలు TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు రూపొందించిన నివేదికను అందజేసింది. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగాధర్, భవానీరెడ్డి ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి పటిష్టం చేయడం, చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై రూపొందించిన నివేదికను సమర్పించారు. కమిషన్ సిఫారసులపై ముఖ్యమంత్రి ప్రతినిధి బృందంతో చర్చించారు. పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహించడం, ఉద్యానవన పంటల సాగును పెంచడం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషన్‌కు సూచించారు. రైతుల ఆదాయం పెంచడంతో పాటు వ్యవసాయాన్ని మరింత స్థిరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను సమన్వయం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కమిషన్ నివేదికలో సూచించింది. చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని ప్రతిపాదించింది. చెరువుల పూర్తి నిల్వ మట్టం సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ పేర్కొంది. గత రెండేళ్లలో కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలను ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం

Original source: prabhanews.com
Read more on Kaizer News