భీమవరం: శివుని అనుగ్రహం, పార్వతీ దేవి ఆశీస్సులు ఉంటే జీవితంలో అంతా శుభమే జరుగుతుందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారే సమర్పించుకోవడం భగవంతుని కృప అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తెలిపారు. ఆదివారం పంచరామక్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతి, అన్నపూర్ణ అమ్మవార్లకు భక్తులు సుమారు 5,000 కేజీల శ్రావణ మాస పట్టి (సారే) ను ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాస పట్టి ఊరేగింపును ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివపార్వతులపై నమ్మకంతో, భక్తితో కొలిస్తే ఆ దైవ దంపతులు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారన్నారు. శివుడు పరమాత్మ తత్త్వానికి ప్రతీక అయితే, పార్వతీ దేవి ఆదిశక్తి స్వరూపిణి. వీరిద్దరి ఐక్యతే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. వందలాది మంది భక్తులు ఏకమై 5,000 కేజీల పట్టిని సమర్పించడం ఎంతో శుభపరిణామం అని అన్నారు. అనంతరం సోమేశ్వర ఆలయం నుంచి గుడి చుట్టూ భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణంరాజు , చైర్మన్ చింతలపాటి బంగార్రాజు పాలకమండలి సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు