Kaizer News

Nellore: సర్వేపల్లి కాలువకట్ట వాసులకు శాశ్వత పట్టా

Nellore: సర్వేపల్లి కాలువకట్ట వాసులకు శాశ్వత పట్టాల కల సాకారం

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సర్వేపల్లి కాలువకట్ట వాసుల 60 ఏళ్ల కల సాకారం కాబోతోందని డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 1215 కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించే ప్రక్రియకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ లైన్‌ క్లియర్ చేశారని వెల్లడించారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి కాలువకట్ట వాసులకు శాశ్వత పట్టాలు ఇప్పించేందుకు మంత్రి నారాయణ అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం కృషి చేశారని రూప్‌కుమార్ తెలిపారు. అధికారుల సూచనల మేరకు దేశంలో తొలిసారిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నర్మదా నది పరీవాహక ప్రాంత వాసులకు పట్టాలు ఇచ్చిన విధానాన్ని పరిశీలించి, అదే తరహాలో నెల్లూరు కాలువకట్ట వాసులకు కూడా న్యాయం జరిగేలా మంత్రి ప్రయత్నించారని చెప్పారు. మంత్రి నారాయణ చొరవతో ఈ నెల 3న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని, దీంతో 1215 కుటుంబాలకు శాశ్వత పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందన్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పట్టాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి పరమేశ్వరి కళ్యాణమండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో మంత్రి నారాయణ ముందుంటున్నారని రూప్‌కుమార్ అన్నారు. గతేడాది భగత్‌సింగ్‌ కాలనీలో 1400 కుటుంబాలకు శాశ్వత పట్టాలు ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలకు అండగా నిలవాలన్న సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను మంత్రి నారాయణ చొరవతో పరిష్కరిస్తున్నారని చెప్పారు. పేదల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి నారాయణపై వైఎస్సార్‌సీపీ నేతలు సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని రూప్‌కుమార్ విమర్శించారు. రోజుకో అబద్ధం చెప్పి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల దుర్మార్గాన్ని ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతోనే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి, టీడీపీ నేతలు బాలాజీ, తిరుమలనాయుడు, జహీర్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News