రామం.. రాజీవ లోచనం అంటాడు దశరథుడు. రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తించాడు మారీచుడు.రూపంలో రాముడంటే రాముడే! గుణగణాల్లోనూ రాముడంటే రాముడే!! అంతటి రాముడు దక్షిణాది సిల్వర్ స్క్రీన్‌పై అంతే గొప్పగా వెలుగులీనాడు.ముఖ్యంగా తెలుగు సినిమాలు.. రాములవారిని ముమ్మూర్తులా నీలాంబుజ శ్యామల కోమలాంగమూర్తిగానే చూపించాయి. ఇందీవర శ్యాముడిగా వెలుగొందిన వెండితెర రామయ్య.. అందరివాడు అనిపించుకున్నాడు. పాన్ ఇండియా ఫార్ములా రాములోరి పాత్రను భిన్నంగా చూపిస్తున్నది. ఉత్తారాది టేకింగ్ నీలిమేఘ ఛాయను అరుణారుణ శోభితంగా మార్చేస్తున్నది. ఈ పోకడకు దక్షిణాది ఎలా స్పందిస్తుందో తెలియాలంటే.. తాజాగా తెరకెక్కుతున్న రామకథలు బాక్సాఫీస్ ముందుకు రావాల్సిందే!! చదివితే పొందే భావోద్వేగం చూస్తే రాదంటారు. ఎందుకంటే.. చదువు మనసుకు చెందినది. చదువుతున్నప్పుడు భావకులు వారి మనసులకు తోచినట్టుగా ఆయా పాత్రల రూపాలను ఊహించుకుంటారు.. గొడవే లేదు. అయితే.. అదే కావ్యాన్ని చూడాల్సివస్తే.. నిర్వాహకుడు (దర్శకుడు) చూపించిందే ఫైనల్. అది జనరంజకంగా ఉందా? లేదా? అనేది నిర్వాహకుడి అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కథకులు, కవులు, కళాకారులు, చిత్రకారులు ఆది నుంచీ అలవాటు చేసిన పలు కళాకృతుల విషయంలో జనాలకు కచ్చితమైన అభిప్రాయాలు ఈ విధంగానే ఏర్పడ్డాయి. వాటిలో మార్పుల్ని సమాజం సహించదు. ఉదాహరణకు రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు.. ఇత్యాది చిత్రకారులు గీసిన అద్భుతమైన దేవతా స్వరూపాలు.. జన హృదయాల్లో బలంగా ముద్రించుకుపోయి పూజలందుకుంటున్నాయి. వాటిని మరోలా చిత్రీకరించి చూపిస్తే జనం అంతగా ఆదరించరు. ఏ పురాణ కళారూపాన్ని సృష్టించాలన్నా భావి తరాలకు ఈ రూపాలే ప్రామాణికాలు. అంతెందుకు.. పురాణపాత్రల పోషణ విషయంలో ఎన్టీఆర్‌కి రవివర్మ చిత్రాలే ప్రేరణ. తాను నటించిన పురాణ పాత్రలకు చెందిన ఫొటోలను బయటికి విడుదల చేసే విషయంలోనూ ఎన్టీఆర్ తగు జాగ్రత్తలు తీసుకునేవారట. రవివర్మ చిత్రాలకు దగ్గరగా తన రూపం ఉండేలా చూసుకునేవారట. అయితే.. అసలు రామాయణం రాసిన వాల్మీకి వర్ణనను అనుసరించే వీరంతా రాముడి రూపాన్ని చిత్రీకరించారా? వ్యాస మహర్షి వర్ణనలకు అనుగుణంగానే మహాభారత, భాగవతాల్లో ఆయా పాత్రల రూపాలు రూపుదిద్దుకున్నాయా? అంటే మౌనమే సమాధానం అవుతుంది. ఏదేమైనా చూసిన దాన్నే జనం నమ్ముతారు. కాబట్టి ‘దేవుళ్లు ఇలాగే ఉంటారు’ అని అంతా ఫిక్సయిపోయారు. అయితే.. ఈ విషయంలో కూడా దక్షిణ భారతీయుల అభిప్రాయాలు ఒకలా ఉంటే.. ఉత్తర భారతీయుల అభిప్రాయాలు మరోలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ సినిమా మేకర్లకు శ్రీరాముడి రూపం ఓ టాస్క్ అయి కూర్చుంది. రాముడంటే భారతీయులకు ఓ ఎమోషన్. అందుకే.. సినిమా వాళ్లంతా రాముడి పాత్ర చుట్టూ కథలల్లేస్తూ తెగ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఇటీవలే శ్రీరాముడిగా ఆయన లుక్‌ని కూడా విడుదల చేశారు. రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో ఈ ఫ్రాంచైజీ తెరకెక్కుతున్నట్టు సమాచారం. మరోవైపు టాలీవుడ్‌లో ప్రతిష్ఠ