ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి సౌకర్యాలు, డిజిటల్ విద్యా వనరులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వసతి గృహాలు, నివాస పాఠశాలల్లో మెస్ చార్జీలను పెంచి నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న ఆహారం నాణ్యత, వసతి సౌకర్యాలు, బోధన విధానం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇంకా అవసరమైన వసతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, మరింత మెరుగైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక, కేజీబీవీ ప్రిన్సిపాల్ మనోరమ, ఎంఈఓ వేల్పుల ప్రభాకర్, తహసీల్దార్ శ్వేతారావు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు గుటోజు కిష్టయ్య, మోడెం ఉమేష్ గౌడ్, మేకల భిక్షపతి, సూరం వీరేందర్, గంగుల రమణారెడ్డి, పున్నం రవి, చల్లగురుగుల సుదర్శన్, ఇప్పకాయల నరసయ్య, మైస భిక్షపతి, కోలేపాక సాంబయ్య, నిమ్మల విజేందర్, కోసరి నరేందర్, జున్ను సదయ్య, రొంటాల వెంకటస్వామి, పల్నాటి శ్రీనివాస్, క్యాతం సదయ్య, పోనుగోటి వీరబ్రహ్మం, ముద్దమల్ల రవి తదితరులతో పాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు