బస్టాండ్ సమీపంలో వాహనాల రద్దీతో ఇబ్బందులు వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రోడ్లపైనే ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ మూల సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఎస్‌బీఐ బ్యాంక్ ముందు వందలాది వాహనాలను రోడ్డుపైనే నిలిపి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలోని బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పాటు బ్యాంకు పైభాగంలో ఉన్న శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కార్యాలయం, పక్కనే ఉన్న హోటల్, మద్యం దుకాణం, కింది సెల్లార్‌లోని చిన్నచిన్న వ్యాపార దుకాణాల కారణంగా ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటోందని స్థానికులు తెలిపారు. చౌరస్తాను మించి ప్రజలు, వాహనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. బస్టాండ్‌కు వెళ్లే బస్సులు, ప్రయాణికులకు వాహనాల పార్కింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఏళ్ల తరబడి సరైన వాహన పార్కింగ్ సౌకర్యం లేకుండానే బ్యాంకు కొనసాగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం బ్యాంకు కింద సెల్లార్‌లో వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించాల్సి ఉన్నప్పటికీ, అక్కడ గదులు ఏర్పాటు చేసి వ్యాపారులకు అద్దెకు ఇవ్వడంతో పార్కింగ్ సమస్య తలెత్తుతోందని బ్యాంకు ఖాతాదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు