Kaizer News

AP CM | ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష…

AP CM | ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష…

· State - Telangana · prabhanews.com

ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష… రైతులకు భరోసా ఇవ్వాలని ఆదేశాలు ధరల నియంత్రణకు చర్యలు.. అధికారులకు చంద్రబాబు కీలక సూచనలు AP CM | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎల్‌నినో వంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంతో పాటు, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సవాలును సమన్వయంతో ఎదుర్కోవాలని అధికారులకు సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్‌, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వలను అవసరానికి అనుగుణంగా మార్కెట్‌లోకి విడుదల చేసి ధరల పెరుగుదలను నియంత్రించాలని సూచించారు. ఉల్లి కొరత రాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోళ్లు చేపట్టడంతో పాటు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రకాశం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో 30.84 లక్షల హెక్టార్లకు గాను ఇప్పటివరకు 79 శాతం భూముల్లోనే సాగు పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రైతులు నష్టపోకుండా పంటల బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు, వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. హైరిస్క్‌ జోన్‌లోని ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు కేటాయించామని, ఖరీఫ్‌ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందించినట్లు చెప్పారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్‌ గార్డెన్లను ప్రోత్సహించి కూరగాయల ధరలను నియంత్రించవచ్చని సీఎం సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని చంద్రబాబు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, సాగునీటి సంఘాలు సమన్వయంతో పనిచేసి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు

Original source: prabhanews.com
Read more on Kaizer News