విందు భోజనం తర్వాత వాంతులు, విరేచనాలు.. సంగెం గ్రామంలో కలకలం కోరుట్ల, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో విందు భోజనం చేసిన 15 మంది అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలో ఏర్పాటు చేసిన విందు భోజనం చేసిన అనంతరం గంట వ్యవధిలోనే కొందరికి అస్వస్థత మొదలైంది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైన 15 మందిని వెంటనే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. కలుషిత ఆహారం లేదా నిల్వ ఉన్న మాంసాహారం కారణంగా అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది