Kaizer News

Asian Games 2026 | 8 గోల్స్‌తో అదరగొట్టిన దీపిక..

Asian Games 2026 | 8 గోల్స్‌తో అదరగొట్టిన దీపిక.. ఉజ్బెకిస్థాన్‌పై భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

· National - India · ntnews.com

Asian Games 2026 | ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 19-0తో ఘన విజయం సాధించింది. గిఫు ప్రిఫెక్చురల్‌ గ్రీన్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌ ఆరో నిమిషంలో లాల్‌రెమ్‌సియామి గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. నవనీత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ను ఉజ్బెకిస్థాన్‌ గోల్‌కీపర్‌ రుషానా చోరీయేవా అడ్డుకోగా.. రీబౌండ్‌ను లాల్‌రెమ్‌సియామి గోల్‌గా మలిచింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు వరుస దాడులతో ఉజ్బెకిస్థాన్‌ రక్షణను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి రెండు క్వార్టర్లు ముగిసే సమయానికి భారత్‌ 5-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో పలువురు భారత ఆటగాళ్లు గోల్స్‌ సాధించారు. మూడో క్వార్టర్‌లో దీపిక తన డ్రాగ్‌ఫ్లిక్‌ నైపుణ్యంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విరుచుకుపడింది. పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకున్న ఆమె ఏకంగా 8 గోల్స్‌ చేసింది. ఇందులో నాలుగు గోల్స్‌ మూడో క్వార్టర్‌లోనే రావడం విశేషం. భారత్‌ తరఫున దీపిక 8 గోల్స్‌తో మెరిసింది. ఇషిక 3, నవనీత్‌ కౌర్‌ 2, లాల్‌థంత్లువాంగి 2, లాల్‌రెమ్‌సియామి, బాల్జీత్‌ కౌర్‌, నేహా, సాక్షి రాణా ఒక్కో గోల్‌ చేశారు. మ్యాచ్‌ మొత్తం భారత జట్టు గోల్స్‌తో హోరెత్తించగా.. ఉజ్బెకిస్థాన్‌కు గోల్‌ చేసే అవకాశం దాదాపుగా దక్కలేదు. రెండో క్వార్టర్‌ చివర్లో షహ్‌జోడా జరీపోవా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్‌ సవిత అడ్డుకోవడం ఆ జట్టు నమోదు చేసిన ఏకైక షాట్‌గా నిలిచింది. చివరి క్వార్టర్‌లోనూ భారత్‌ మరో మూడు గోల్స్‌ సాధించి 19-0తో మ్యాచ్‌ను ముగించింది. ఏషియన్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. భారత మహిళల హాకీ జట్టు తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 21న ఇండోనేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కూడా కకమిగహరాలోని గిఫు ప్రిఫెక్చురల్‌ గ్రీన్‌ స్టేడియంలో జరగనుంది

Original source: ntnews.com
Read more on Kaizer News