తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు బాగా ఫాలో అవుతుందేమో, సింహం అద్దం ముందు నిలబడి గడ్డం సవరించుకుంటూ దరహాసంతో ‘నేను సింహంలాంటి దాన్ని’ అనుకుంది. వెంటనే, ‘ఛ... ఛ... నేను సింహంలాంటి దాన్నేమిటీ? నేనే సింహాన్ని’ ఆలోచనను సవరించుకుంది. ‘ఈ అడవికి రాజును. ఏనుగు నుంచి ఎలుకపిల్ల వరకు, మహావృక్షం నుంచి గడ్డిపరక వరకు, పక్షి నుంచి పారాడే పురుగు వరకు ప్రతిదీ నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!’ ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, గుహ బయటికి రావటానికి సమాయత్తమవుతుంటే, మనసుకు ఏదో సంకేతం అందుతున్నట్టు అనిపించింది. ఏమిటది? కొత్త ఉపద్రవమా? అడవుల్లో వుండే జంతువులకి, పక్షులకి, ఇతర జీవచరాలకీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు జీవితమే! ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకనూ ఉపద్రవమే! క్రూర జంతువుల రూపంలో, వేటగాళ్ల రూపంలో. అయినా తను ఈ అడవికి రారాజు. తనకి ఎవరివల్ల ఉపద్రవం ఉంటుంది? తనే మిగిలిన జంతుజాలానికి ఉపద్రవం కాని. తనని తాను సమాధానపరచుకుంది సింహం. ఆలోచిస్తూ గుహ బయటికి వచ్చి బోర విరుచుకు నిలబడి చుట్టూ ఒకసారి తేరిపార చూసింది. ఎదురుగా కుక్క, నక్క! పుట్టుకతో బద్ధశత్రువులైన రెండూ అక్కడ ఒకదాని పక్క మరోటి నిలబడి వున్నాయి– అదీ పెళ్లి చేసుకున్న ఆనవాళ్లతో, అలంకరణలతో... సింహాన్ని చూసి కుక్క అంది ‘మహారాజా, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.’ సింహం తన కళ్ళని తానే నమ్మలేక పోయింది. ‘పెళ్లా? మీరా?’ అన్నది పైకి. ‘చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? పరస్పరం కలహించుకునే రెండు జాతులు పెళ్లి చేసుకోవటం ఉపద్రవం కాక మరేమిటీ?’ మనసులో అనుకుంది. ‘అవును మహారాజా. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వదించండి’ ఈసారి నక్క అంది వినయంగా. దాని వినయం తెలుస్తూనే వుంది. ‘మీ ఇళ్లల్లో ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి?’ ‘లేదు మహారాజా. విభిన్న జాతుల మధ్య ప్రేమను సమాజం ఎప్పుడూ సులభంగా అంగీకరించలేదు. అయినా మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. మా అభిప్రాయాలు కలిశాయి. మేము పెళ్లి చేసుకున్నాము. ఇతరులతో మాకు పనేముంది మహారాజా?’ అంది కుక్క. ‘అభిప్రాయాలు కలవటమా? అసలు మీ జాతులే వేరైనప్పుడు, అలవాట్లే వేరైనప్పుడు, అభిప్రాయాలు కలవటం వింతగా వుంది.’ ‘అభిప్రాయాలు కలవటానికి, జాతులు వేరవటానికి సంబంధమేమిటి మహారాజా. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాల్లో చూళ్ళేదూ హీరో హీరోయిన్లు దెబ్బలాడుకుంటూనే ప్రేమలో పడటం. ఇదీ అంతే అనిపించింది.’ ‘మనుషుల గురించి వదిలెయ్యండి. సృష్టిలో వాళ్ళని మించిన నమ్మక ద్రోహులు, స్వార్థపరులు మరెవరూ వుండరు. ఒక పని చేస్తే కొంత లాభం వస్తుందనుకుంటే స్వంత వాళ్లనే వదులుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి నీతి, జాతి లేని వాళ్ళతో– మనకి పోలికేమిటి?’ సింహం గర్జించింది. ఆ అరుపుకు కుక్క, నక్క గాభరా పడ్డాయి. ‘అవసరం కోసం మనుషులు ఎంతకిందికైనా దిగజారతారు. డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారు. అలాంటి వాళ్ళు అంతకంటే మంచి సినిమాలు తియ్యలేరులే. అయినా– సినిమాలు చూసే మీరు ఇవన్నీ చేశారా?’ సింహం అడిగింది. ‘అవును, కాదు’ల మధ్యగా రెండూ తల ఊపాయి. ‘అయినా ఒక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. రేపు మీ పిల్లల్ని తోటి సమాజం సంకర జాతి అని హేళన చెయ్యదా?’ రెండూ తలలు వం