మీ సమస్య నా సమస్య.. మీ గ్రామ అభివృద్ధి నా బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని, అందులో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని ఇందిరా నగర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధిని తన బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇందిరా నగర్ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా నగర్ గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా గణనీయమైన లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. గ్రామంలో 44 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో చాలావరకు నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. గ్రామంలోని 96 మందికి పెన్షన్లు అందుతుండగా, ఇందుకోసం రూ.6.32 లక్షలు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా 66 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.10.08 లక్షల లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 15 కుటుంబాలకు రూ.7.27 లక్షలు అందినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. 20 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.10.09 లక్షలు విడుదల చేయగా, 41 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.6.20 కోట్ల రుణాలు అందినట్లు వివరించారు. గ్రామంలోని 52 మంది రైతులకు రూ.37.61 లక్షల మేర రైతు రుణమాఫీ లబ్ధి చేకూరగా, 235 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.93.04 లక్షలు అందినట్లు మంత్రి తెలిపారు. 52 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.10.57 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే ఆరుగురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించామని, గ్రామంలో 69 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుతం 382 రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఇందిరా గాంధీ పేరు మీద ఏర్పడిన ఇందిరా నగర్ గ్రామం తనకు ప్రత్యేకమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంతో కొన్ని సమస్యలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఇకపై సంక్షేమం, అభివృద్ధి రెండూ అర్హులైన ప్రతి కుటుంబానికి సమానంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో భాగంగా ఇళ్