Kaizer News

YSRCP High Court: స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ న్

YSRCP High Court: స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం -ఎన్నికలంటే భయపడుతున్నారా?

· State - Telangana · telugu.abplive.com

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చుట్టూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తయి, తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశమై స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాల్సిందేనని హెచ్చరిస్తూనే, మరోవైపు కోర్టుకు వెళ్లడంపై అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. గతంలో సర్ ప్రక్రియ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించిన వైఎస్సార్‌సీపీ, ఇప్పుడు అదే సర్ ప్రక్రియ ముగిసేదాకా ఎన్నికలు నిర్వహించవద్దని కోరడం వెనుక ఎన్నికలకు భయపడి పారిపోవడమే కారణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకోవడం కంటే.. ఓటర్ల జాబితాలో లోపాలను సాకుగా చూపి, ఓటమి ఎదురైతే దానికి సాంకేతిక సమర్థనను సిద్ధం చేసుకోవడమే వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం వెనుక ఉన్న అసలు వ్యూహం అన్న భావన వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎందుకని వాయిదా వేయాలని భావిస్తోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల తీవ్ర ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్ ఇంకా కోలుకోలేదు. అధికార కూటమి క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో పాటు, పంచాయితీ, మున్సిపల్ పోరులో గెలిచేందుకు అవసరమైన ఆర్థిక, రాజకీయ బలం చూపించలేక నేతలు వెనుకంజ వేస్తున్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఎన్నికలకు వెళ్తే.. తమ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగి ఓటమి ఎదురైతే, ఓటర్ల జాబితా సక్రమంగా లేదు కాబట్టే ఓడిపోయాం అనే కవచాన్ని ముందే సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినప్పటికీ, కూటమి సంక్షేమ పథకాల అమల్లో తీవ్రమైన వ్యతిరేకత ఇంకా రాలేదని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఎన్నికలు కొంతకాలం వాయిదా పడితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని, తద్వారా తమకు అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తోంది. సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం చట్టబద్ధమైన హక్కే అయినప్పటికీ.. రాజకీయంగా ఇది నెగెటివ్ ముద్రను మోసుకొస్తోంది. ప్రత్యర్థి టీడీపీ ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే కోర్టుల చుట్టూ తిరుగుతోంది అని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే జగన్ ఇన్‌ఛార్జులకు వార్నింగ్ ఇచ్చి బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం కోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా శ్రేణుల్లోనే మనం గెలవలేమా అనే నిరాశ పెరిగే ప్రమాదం ఉంది. ఈ న్యాయపోరాటంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దాన్ని బట్టి ఏపీ స్థానిక పోరు షెడ్యూల్ మాత్రమే కాదు, ప్రధాన పార్టీల భవిష్యత్ వ్యూహాలు కూడా ఆధారపడి ఉంటాయి. (IST) Tags : YS Jagan AndhraPradesh YSRCP AP Politics High Court TDP #tdp AP Local Body Elections Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul

Original source: telugu.abplive.com
Read more on Kaizer News