Shorts ఆక్స్‌ఫర్డ్: భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు, తొమ్మిదేళ్ల గంటా జిష్ణు ఆర్యన్ ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన టెడ్ ఎక్స్ ఒస్నే (TEDxOsney) వేదికపై తొలిసారి ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే గోల్డెన్ రేషియోలోని 216 దశాంశ స్థానాలను నిమిషంలోపు గుర్తుచెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సాధించిన జిష్ణు.. తాజాగా అంతర్జాతీయ టెడ్ ఎక్స్ (TEDx) వేదికపై తన ఆలోచనలను పంచుకున్నాడు. ఫుట్‌బాల్‌పై తనకున్న ఆసక్తిని ప్రస్తావిస్తూ.. జీవితంలో తన దారిని తానే ఎంచుకోవాలని జిష్ణు సందేశమిచ్చాడు. ఎదురయ్యే ఓటములు, భయాలకు కుంగిపోకుండా మళ్లీ లేచి ముందుకు సాగాలన్న సందేశాన్ని “I fall, I cry, I get up” అంటూ వినిపించాడు. చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం, పట్టుదలపై తనదైన శైలిలో మాట్లాడి సభికుల దృష్టిని ఆకర్షించాడు. నారాయణ గ్రూప్ డైరెక్టర్లు గంటా రవితేజ, షరణి పొంగూరు దంపతుల కుమారుడైన జిష్ణు.. తన కుటుంబ వారసత్వంతో పాటు సొంత ఆసక్తులు, లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాడు. తాత గంటా శ్రీనివాసరావు మాజీ హెచ్‌ఆర్‌డీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే కాగా, మరొక తాత పొంగూరు నారాయణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. తల్లి షరణితో కలిసి ఒకే అంతర్జాతీయ TEDx వేదికను పంచుకున్న జిష్ణు.. “Quo Vadis - Where Are You Going?” అనే ఇతివృత్తానికి అనుగుణంగా తన దిశను తానే నిర్ణయించుకునే ధైర్యం గురించి మాట్లాడాడు. గిన్నిస్ రికార్డుతో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ బాలుడు, ఆక్స్‌ఫర్డ్ వేదికపై తొలి ప్రసంగంతో తన ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నాడు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’