దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు: మాల నాయకులు రాజ్యాంగబద్ధంగా శాంతియుత ఉద్యమం కొనసాగిస్తాం.. మద్దతివ్వాలని పిలుపు శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణ అంశంపై పార్లమెంటులో స్పష్టమైన చట్టం చేసే వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని మాల సామాజిక వర్గ నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య విభేదాలు సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీసే రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేషనల్ ఫ్రంట్ ఫర్ మాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా పరిమిత స్థాయిలోనే ఉద్యోగ, విద్యా అవకాశాలు లభిస్తున్న పరిస్థితుల్లో వాటిని మరింతగా వర్గాల మధ్య విభజించడం వల్ల ప్రయోజనాల పంపిణీపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు గతంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే బీజం పడిందని, ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న అనేక కులాల మధ్య పరిమిత అవకాశాలను ఏ విధంగా సమన్యాయంగా పంచుతారనే దానిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాల నాయకులు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ ఉపకులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీకి సంబంధించిన విధానాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నిర్ణయాలు ఇప్పటికే జరిగిపోయాయని భావించి ఎవరూ నిరాశ చెందవద్దని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయం బలంగా వ్యక్తమైతే నిర్ణయాలపై పునఃసమీక్షకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. మాల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులు సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం ముందుకు రావాలని కోరారు. రాజకీయ పార్టీలకు విధేయతతో పాటు సామాజిక సమస్యలపై కూడా బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు. ఎలాంటి హింసకు తావులేకుండా రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో ఐక్యంగా శాంతియుత పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం. నరేష్, కనికెళ్ల నాని, తోట దుర్గాప్రసాద్, వెంకటరమణ, కేశవ్ ప్రసాద్, గోవిందప్ప, అరవింద్ తదితరులు పాల్గొన్నారు