Rayachoty: SV విద్యామందిర్ హైస్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.రాయచోటి లో SV విద్యామందిర్ హైస్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. అప్పట్లో ప్రజలకు కష్టంగా ఉన్న గ్రాంథిక భాషకు బదులుగా అందరికీ సులభంగా అర్థమయ్యే వ్యావహారిక భాషను ప్రోత్సహించేందుకు గిడుగు వెంకట రామమూర్తి విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, మన వ్యక్తిత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ తెలుగు భాషను ప్రేమించి, పరిరక్షించాలని డాక్టర్ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషను కూడా నేర్చుకోవడం ఎంతో అవసరమని, అయితే ఇతర భాషలను నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును గౌరవించి, ప్రేమించాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తెలుగు భాష పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు