సమాజంలో శాంతి నెలకొనాలంటే అందరూ ధ్యానులు కావాలి నర్సాపురం, ఆంధ్రప్రభ : సమాజంలో శాంతి నెలకొనాలంటే అందరూ ధ్యానులు కావాలని, సమస్యలు, కష్టాలకు స్వాగతం పలకాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ కురేళ్ల శ్రీలక్ష్మి (అమెరికా) అన్నారు. ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ వై.ఎన్. కళాశాల అరవింద ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకున్నప్పుడే మనిషి రాటుదేలుతాడన్నారు. గత జన్మలోని పాపాలే ఈ జన్మలో కష్టాలు, నష్టాలుగా వస్తాయని పేర్కొన్నారు. మనమంతా పాఠాలు నేర్చుకోవడానికి జన్మించి భూమిపైకి వచ్చామని తెలిపారు. ధ్యానం, శాకాహారంతో అసాధ్యాలను సైతం అధిగమించవచ్చన్నారు. డబ్బుతో సుఖం మాత్రమే లభిస్తుందని, ధ్యానం చేయడం ద్వారా ఆనందం, పరమానందం, ఆత్మానందం కలుగుతాయని శ్రీలక్ష్మి తెలిపారు. భవబంధాలను వదులుకోవాలని సూచించారు. ‘‘నిన్ను నీవు తెలుసుకో’’ అని రమణ మహర్షి చెప్పారని, ఆ దిశగా అందరూ నడవాలని అన్నారు. అనంతరం తన ధ్యాన అనుభవాలను వివరించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ బి. ప్రతాప్‌కుమార్ (ఆకివీడు) మాట్లాడుతూ ప్రతి మనిషిలో పంచేంద్రియాలతో పాటు మరో ఇంద్రియం ఉందని, అదే ఆత్మ అని అన్నారు. అక్షరాభ్యాసం కోసం తన వద్దకు వచ్చే పిల్లలతో ‘‘ఆత్మ సత్యం’’ అని రాయిస్తానని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. సమాజంలో శాంతి నెలకొనాలంటే అందరూ ధ్యానం చేయాలని ప్రతాప్‌కుమార్ సూచించారు. ప్రతి హిందువు భగవద్గీత పఠనం, ధ్యానం, ప్రతి ముస్లిం ఖురాన్ పఠనం, ధ్యానం, ప్రతి క్రైస్తవుడు బైబిల్ పఠనం, ధ్యానం చేయాలని సూచించారు. పీఎస్‌ఎస్‌ఎ జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ మాట్లాడుతూ ధ్యానం అనే అద్భుత దీపాన్ని బ్రహ్మర్షి పత్రీజీ అందించారని అన్నారు. కార్యక్రమంలో టి. కృష్ణవేణి, కళ్లేపల్లి స్వర్ణలత, నాగళ్ల భాస్కరరావు, కె.వి.డి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు