విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన 264 మంది క్రీడాకారులకు రూ.8.8 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో దాగిన మాణిక్యాల్లాంటి క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మరింతగా సత్తా చాటేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే అందులో పాల్గొనే క్రీడాకారుల్లో 10 శాతం మంది తెలుగువారే ఉండేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రవి నాయుడు తెలిపారు. ఇందుకోసం ప్రతిభావంతులైన క్రీడాకారులను చిన్న వయసు నుంచే గుర్తించి, వారికి అవసరమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా నిర్వహించామని, భవిష్యత్‌లోనూ రాష్ట్రంలోని క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. క్రీడా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత మంది యువత క్రీడల వైపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు