Kaizer News

ఎప్పుడు ఉపఎన్నికొచ్చినా కాంగ్రెస్‌‌ రెడీ : పీసీసీ

ఎప్పుడు ఉపఎన్నికొచ్చినా కాంగ్రెస్‌‌ రెడీ : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌

· State - Telangana · v6velugu.com

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్​పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ చీఫ్​మహేశ్‌‌కుమార్‌‌ గౌడ్‌‌ అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. రాష్ట్రంలో ఈ ఫిరాయింపుల కల్చర్ ను తెచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలకు ఇది చెంపపెట్టు అని విమర్శించారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్.. శనివారం తెలంగాణ భవన్ లోని శబరీ బ్లాక్ లో మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి గెలిచి ఎమ్మెల్యేలకు నేరుగా మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర గులాబీపార్టీది అని ఫైర్ అయ్యారు. అలాగే కాంగ్రెస్‌‌కు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్‌‌ఎస్‌‌లోకి తీసుకుని ప్రతిపక్షానికి శాసనసభలో సరైన హోదా లేకుండా చేశారన్నారు. 2023లో బీఆర్ఎస్ అహంకార ప్రభుత్వం కూలి.. కాంగ్రెస్‌‌ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే.. ప్రభుత్వాన్ని కూల్చుతామన పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారని అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్​పై ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులను బీజేపీ కూడా ప్రోత్సహించిందని మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ ఆరోపించారు. ఫిరాయింపులతో ఆగకుండా.. పార్టీలను చీల్చి లబ్ధిపొందే సంస్కృతికి తెరపేలిందని మండిపడ్డారు. టీ-ఎంసీ, శివసేన, ఎన్‌‌సీపీ వంటి పార్టీలను చీల్చి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. పాత బీజేపీ నేతలకు ఉన్న రాజకీయ విలువలు, ప్రస్తుత బీజేపీ నేతల్లో కనిపించడం లేదన్నారు. కాగా.. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్‌‌రెడ్డిదేనన్నారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో హైకమాండ్, సీఎం నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శనివారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన మహాగణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, పాడిపంటలతో రైతులు సుభిక్షంగా వర్ధిల్లాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన విజయవంతంగా ముందుకు సాగుతోందని, దేశంలోనే తెలంగాణ అన్నింట్లో నెంబర్ వన్ స్థానంలో నిలవాలని భగవంతునికి పూజలు చేసినట్టు వెల్లడించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News